Monday, December 7, 2009

అస్సల్ గీ తెలంగాణ ఎంది భై - ఎన్దుక్ గావాలే!

'నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..' ఇది ఒకప్పటి మాట.. నేడు ఈ ప్రాంత బిడ్డలు కష్టాల కొలిమిలో కాలిపోతూ కన్నీళ్లు పెడుతోందెందుకు..? ఆకలి మంటల్లో కాలుతూ మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతోందెందుకు..? బుక్కెడు బువ్వకు దిక్కు లేక, డొక్క నిండేందుకు రెక్కాడక వలస బాట పట్టిందెందుకు..? పసి పిల్లల జీవితాలకు వెలకట్టడెమెందుకు.. పడతి మానానికి ఖరీదు కట్టడమెందుకు..? బ్రిటిష్‌ పాలకులతో పోరాడి గెంటేసినా, రజాకార్లను రక్తం చిందిస్తూనే తరిమికొట్టినా తీరని ఈ అవస్థను సృష్టించింది ఆంధ్రపాలకుల వ్యవస్థ. ఇది నిష్టూర సత్యం.. నిత్యం కళ్ల ముందు కనిపించే సత్యం.. ఇది తెలియాలంటే మీకు తెలంగాణ ఏమిటో తెలియాలి.. ఉమ్మడి రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలియాలి.. వాటి వల్ల ఏర్పడిన నష్టాలు తెలియాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కలిగే లాభాలు తెలియాలి.. తెలుసుకోండి.. ఒక్కసారి ఆలోచించండి..!

నాటి తెలంగాణ
రాజకీయ చరిత్ర చూస్తే 1294-1351 కాలంలో ముల్కీ ఉద్యమాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఖిల్లీ, తుగ్లగ్‌లతో పాటు దక్షిణాది నుంచి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలుగా పిలిచారు. ఆ తర్వాత విభేదాలతో వీరంతా షియాలు, సున్నీలుగా విడిపోయారు. 1422-1435 కాలంలో ఒకటో అహ్మద్‌షా కాలంలో ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. 1436-1458లో రెండో అహ్మద్‌షా కాలం నాటికి ఇవి మరింత తీవ్రమయ్యాయి. 1512లో కూలీకుతుబ్‌షా ఈ ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాల ఫలితంగా సంభవించిన రాజ్య పతనం నుంచి గుణపాఠం నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు.

మళ్లీ తలెత్తిన ముల్కీ సమస్య
ఐదో నిజాం కాలంలో మళ్లీ ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు మొదలయ్యాయి. అవి ఈనాటికీ రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగి మొగల్‌ సామ్రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్‌ ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యానికి వలస వచ్చారు. కవులు, కళాకారులు, విద్యావంతులు ఇక్కడికి తరలివచ్చారు. ఐదో నిజాం కాలంలో సాలార్‌జంగ్‌ పరిపాలనా సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం వలస వచ్చారు. స్థానికులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్ది వెనక్కి వెళ్లిపోతారన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ సంస్కరణ బెడిసి కొట్టింది. ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్న ఉద్యోగాలే కాకుండా వచ్చిన ఉద్యోగాల్లో కూడా తమ వారినే నియమించుకొని స్థానికులను అణిచివేశారు. కిషన్‌ప్రసాద్‌ బహద్దుర్‌ పోరాటంతో కొంత మేరకు ప్రయోజనం చేకూరినా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. 1948లో పోలీసు చర్య జరిగే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌ముల్కీలదే పెత్తనం.

మొగ్గ తొడిగిన నిరసన
నైజాం హైదరాబాద్‌ సంస్థానం మూడు భాషా ప్రాంతాలతో కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలుగు మాట్లాడే 8 జిల్లాలు హైదరాబాద్‌లో ఉండేవి. వీటితో పాటు మరాఠీ భాష మాట్లాడే 5 జిల్లాలు, కన్నడం మాట్లాడే మూడు జిల్లాలు కలుపుకొని మొత్తం 16 జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉండేవి. 1948 సెప్టెంబరు 13వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై పోలీస్‌ చర్యను ప్రారంభించింది. సెప్టెంబరు 17వ తేదీన నిజాం రాచరికం అంతమైంది. హైదరాబాద్‌ రాష్ట్రంలో మిలిటరీ గవర్నర్‌గా జేఎన్‌ చౌదరినినియమించారు. 1949 డిసెంబరు వరకు ఇది కొనసాగింది. 1950లో సీనియర్‌ సివిల్‌ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే సమయంలో ఉద్యోగాల వేటలో ఆంధ్రులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. తెలంగాణ వారికి ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేదన్న సాకుతో ఇష్టారాజ్యంగా ఆంధ్రులను ఇక్కడి ఉద్యోగాలలో నియమించడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టులో హైదరాబాద్‌ హిత సంరక్షణ సమితి పేరిట తొలి ఉద్యమం ఆంధ్రుల పెత్తనానికి నిరసనగా మొగ్గతొడిగింది. కానీ అధిష్టానం బెదిరింపులు, బుజ్జగింపుల కారణంగా మొగ్గలోనే రాలిపోయింది.

ఓరుగల్లులో శ్రీకారం..
ఆంధ్రపాలకుల అహంకారజ్వాలలో మాడిపోయిన తెలంగాణ వాసుల పోరుకు ఓరుగల్లులో శ్రీకారం చుట్టారు.మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్‌ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. స్థానికేతరులను ఉద్యోగాల నుంచి తొలగించి స్థానికులకు అవకాశం కల్పిస్తామన్న హామీతో ఉద్యమాన్ని విరమించారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 7వ తేదీన ఖమ్మం మెట్టులో మరో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర చోట్ల ఆందోళనలు జరిగాయి. హన్మకొండలో విద్యార్థుల ఒంటి మీద లాఠీలు విరిగాయి. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌, సూర్యాపేట పట్టణాలలో నినాదాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో తెలంగాణ అట్టుడికింది. తెలంగాణ ఐక్యవేదిక ఉద్యమ నాయకుడైన కేశవరావుజాదవ్‌ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమం పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పులలో ఏడుగురు విద్యార్థులు నేలకొరిగారు. ఇదే దశలో కాళోజీ నారాయణరావు, జయశంకర్‌ తదితరులు ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు.

ఆంధ్రుల సృష్టి విశాలాంధ్ర
మహా భారతంలో శకునిలా మాయపాచికలతో పథక రచన చేసే ఆంధ్రులు, ఆంధ్రపాలకుల కుట్రల ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమం బలం పుంజుకుంది. 1949లో అయ్యిదేవర కాళేశ్వర్‌రావు ఈ విశాలాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ విలీనానికి పాచికలు కదిపారు. ఆంధ్ర మహాసభలో సైతం ఈ ప్రస్తావన తీసుకురాగా అప్పటి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇది గాలి మాటగా కొట్టిపారేశారు. సుందరయ్య 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం', కమ్యూనిస్టుల ఒకే జాతి, ఒకే భాష. ఒకే రాష్ట్రం అన్న ప్రచారాన్ని ఉద్యమానికి ఊపునిచ్చాయి. కాంగ్రెస్‌కు తెలంగాణలో 1952లో జరిగిన ఎన్నికలలో అధిక సీట్లు రాకపోవడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. వీరి కుట్రల ఫలితంగా మొదట విజయవాడ అనుకున్నా తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కావిరంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి,జేవీ నర్సింగ్‌రావులు 1956 ఫిబ్రవరి 20వతేదీన ఢిల్లీలో సమావేశమై ఓ నిర్ణయానికి రాగా 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.

అమలుకు నోచని 14 సూత్రాలు
ఆంధ్రుల ఉక్కుపాదాలు తెలంగాణ ప్రాబల్యాన్ని అణిచివేసే ప్రక్రియ ఆక్షణం నుంచే ఆరంభమైంది. ఈ రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రంగా పేరు పెడదామన్న తెలంగాణ నేతల వాదనను ఆక్షేపించిన ఆంధ్రనేతలు దీనిని ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండేందుకు గాను కేంద్రం సమక్షంలో ఆనాడే 14 సూత్రాలను రూపొందించారు. కానీ అవేవీ అమలులో లేవు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు బడ్జెట్‌ ఆప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని, మధ్య పాన నిషేధాన్ని తెలంగాణ వాసులు కోరితే అమలు చేయాలని, విద్యా, ఉద్యోగరంగాలలో తెలంగాణకు సంబంధించి ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగాల తీసివేత ఆయా ప్రాంతాల వారి నిష్పత్తిని బట్టే జరగాలని, ముఖ్యమంత్రిత్వ శాఖలలో ఏవేనీ రెండు శాఖలు తెలంగాణ నేతలకు అప్పగించాలని ఇలాంటి వన్నీ అందులో ఉన్నాయి. కానీ ఇన్నేళ్లలో వీటిలో ఏ ఒక్కటీ అమలు లోనికి రాలేదు. అణిచివేతలు, దురాక్రమణలు, అధిపత్యం, చివరికి అంత్యక్రియలలోనూ తెలంగాణ వాసుల పట్ల వివక్ష కొనసాగింది.

పాల్వంచలో మొదలైన ఉద్యమం
ఈ వివక్షను ఓర్వలేకపోయిన తెలంగాణ వాసుల గుండెలు అగ్ని గుండాల్లా రగిలిపోయాయి. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం... ఇంకానా... ఇకపై సాగదు... అన్న శ్రీశ్రీ అక్షరాల సాక్షిగా ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1969 జనవరి 5వ తేదీన మళ్లీ ఉద్యమం మొదలైంది. తెలంగాణ వాసులు కాని వారిని వెనక్కి పంపించాలన్న ఈ ఉద్యమం జనవరిలో నిజమాబాద్‌కు పాకింది. మర్రి చెన్నారెడ్డితో పాటు ప్రముఖులు సహకారం ఉండడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాలు, ర్యాలీలు, నినాదాలు, లాఠీఛార్జీలతో రాజధాని నగరమైన హైదరాబాద్‌ వేడెక్కింది. ఫలితం అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మనందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తామని, తెలంగాణ నిధులలెక్క తేల్చి చెపుతామని, తెలంగాణ రక్షణ అమలు చేస్తామని చెప్పారు. హామీల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారు. కానీ ఆహామీలు కూడా అమలుకు నోచుకోలేదు. ఉద్యమ ఫలితంగా తెలంగాణ వాసులను రెండువేల ఉద్యోగాలు మాత్రం కేటాయించారు. ఇలా చెపుతూపోతే తెలంగాణ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాసుల గుండె నిత్యం రగిలిపోతూనే ఉంది.

ఆ పోరాటమే స్ఫూర్తి..
ఆనాటి మహామహుల పోరాటమే స్ఫూర్తిగా తిరిగి 1999లో కల్వకుంట చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు. నానాటికీ పెచ్చుమీరుతున్న ఆంధ్రపాలకులను అణిచివేసి ఉద్యోగాలు లేక, ఉపాధి వనరులు లేక అల్లాడుతున్న తెలంగాణ నిరుపేదల గుండె మంటలు చల్లార్చేందుకు శ్రీకారం చుట్టుకున్నదే ఈ ఉద్యమం. 1999లో శ్రీకారం చుట్టుకున్న ఈ ఉద్యమం 2001 నాటికి ఊహించని రీతిలో బలోపేతమైంది. తెలంగాణ వాసులలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆగ్రహ జ్వాలలు ఈ ఉద్యమం ద్వారా వెలుగులోనికి వచ్చాయి. తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు సైతం ఈ ఉద్యమం మనకోసమే నంటూ తోడు నిలిచారు.. నడుం బిగించి ముందుకు కదిలారు.. దీంతో పల్లెసీమలు, పట్టణాలు, తండాలు తెలంగాణ డప్పు చప్పుళ్లు, తెలంగాణ గీతాలతో మారుమోగాయి. పాలకులను తట్టి లేపాయి. ఫలితంగా పార్టీలు, పాలక వర్గాలు కూడా తెలంగాణ ఏర్పాటుకు తమ అంగీకారాన్ని తెలిపే దిశకు వారిని నడిపించిన ఘనత కేసీఆర్‌దే..

తెలంగాణ ఎందుకు..?
అవగాహన లేని వారి మనసుల్లో ఉద్భవించే తొలి ప్రశ్న ఇదే. ఇందుకు ఎన్నో సమాధానాలున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రగతి, తెలంగాణ వాసుల జీవితాలలో మార్పు ప్రత్యేక రాష్ట్రం మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణ వస్తే కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు మన కళ్లముందే పారుతాయి. రైతుల కళ్లలో కాంతులు నిండుతాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.70 వేల కోట్లు ఉంటుంది. ఈ ఆదాయంతో సక్రమమైన ప్రణాళికల ద్వారా ఐదేళ్లలో రాష్ట్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దవచ్చు. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ.55 వేల కోట్ల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ, విద్యారంగాల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి, వైద్యరంగం ప్రగతి వంటివి ఎన్నో చేపట్టవచ్చు. ఒక్కో జిల్లా అభివృద్ధికి రూ.5 వేల కోట్ల చొప్పున కేటాయించవచ్చు.

మన వనరులు మనకే..
సింగరేణి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటు తెలంగాణకు మాత్రమే ఇచ్చుకుంటే రైతుకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్‌ ఇవ్వవచ్చు. విలీనానికి ముందు రూపకల్పన చేసిన ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్ల కాలంలో పూర్తి చేయవచ్చు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. వ్యవసాయ వృద్ధితో ఒనగూరే సంపదతో లక్షలాది మంది యువతకు పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించవచ్చు. అక్షరాస్యతలో వెనుకబడిన తెలంగాణలో గ్రామానికో పాఠశాలను నెలకొల్పి ఉచిత విద్య ద్వారా 10 ఏళ్లలో నూరు శాతం అక్షరాస్యత సాధించవచ్చు. రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు, జూనియర్‌, కార్పొరేట్‌ కళాశాలల ఏర్పాటు, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల, జిల్లా కేంద్రంలో మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వంటివి అందించవచ్చు. చదువుకున్న నిరుద్యోగులకు రుణ సౌకర్యం ద్వారా పరిశ్రమలను స్థాపించుకునే అవకాశం కల్పించవచ్చు. గిరిజనతండాలను పంచాయతీలుగా మార్చవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయాలను నివారించి వారికి విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అవకాశాలు కల్పించవచ్చు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున సాగు భూమి అందించవచ్చు. ఆకలి చావులకు దూరంగా, వలసలకు భిన్నంగా సస్యశ్యామల తెలంగాణ రాష్ట్రాన్ని చూడవచ్చు. సుఖమయ జీవితానికి బాటలు పరచవచ్చు.

1 comment:

  1. nice blog.
    jai telangaanaa.


    http://jaitelangaanaa.blogspot.com

    ReplyDelete