Monday, December 7, 2009
తెలంగాణ ఇంకెన్ని త్యాగాలు చేయాలి?
నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి పోలీసుస్టేషన్‌లో పని చేసే కృష్ణయ్య తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని డిసెంబర్ ఒకటిన కామారెడ్డిలో మరణించాడు. ఆయన ఆఖరుగా అన్న మాటలు 'జై తెలంగాణ. అంతకు ముందు రోజు వరంగల్‌జిల్లాకు చెందిన విద్యార్థి భూక్యప్రవీణ్, మెదక్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకోసం ఆత్మార్పణ చేశారు. అదేరోజు కరీంనగర్ జిల్లాలో తెరాస కార్యకర్త పృధ్వీరాజ్ జరుగుతునన పరిణా మాలను జీర్ణించుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిపీఠం ఎక్కాడు. అంతకుముందు రోజు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో నల్గొండజిల్లాకు చెందిన విద్యార్థి శ్రీకాంత్ ఒంటిపై కిరోసిన్/పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి.అదేరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన దమనకాండ, పోలీసుల జులుం, క్రౌర్యం తాళలేక ఒక విద్యార్థి మరణించాడు. పోలీసుల లాఠీలకు ఎందరో విద్యార్థుల తలలు పగిలాయి. కాళ్లు, చేతులు విరిగాయి. మరెందరో ఆసుపత్రులపాలయ్యారు. ఇట్లా తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా వారం, పది రోజులక్రితంవరకు సాధారణ విద్యార్థులు, వ్యక్తులు. కాని వారిఆశయం, లక్ష్యసాధనకోసం చేసిన త్యాగం తో వారు గొప్ప వీరులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారు. త్యాగాలు ప్రణాళికా బద్ధంగా జరగవు.ఉద్వేగం, ఉద్రేకం, ఆవేశం కట్టలు తెంచుకుని తాము ఆశించిన పవిత్ర మార్గం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆత్మార్పణ చేసిన త్యాగధనులు వీరు.1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఆందోళనలో 350 మంది విద్యార్థి, యువకులుసైతం ఇదే విధంగా తమ ప్రాణాలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తృణప్రాయంగా అర్పించారు. సరిగ్గా నలభై సంవత్సరాల అనంతరం అంతే ఉద్వేగంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆందోళన అగ్గి రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు (కెసిఆర్) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నవంబర్ 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు బయల ుదేరగా పోలీసులు అతడిని మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకోవడంతో నిప్పురవ్వ ఎగిసిపడింది. ఉస్మానియా, కాక తీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యా లయాల విద్యార్థులు కదం తొక్కుతూ రోడ్లపైకి రావడం నిప్పురవ్వ కాస్త మంటగా రూపాంతరం చెందింది.1969 నాటి ఉద్యమంకన్నా వేడిగా, వాడిగా, వేగంగా 2009 నాటి ఈ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన విస్తరించింది. ప్రచార, ప్రసారసాధనాల కారణంగా ఎక్కడ, ఎప్పుడు, ఏమి జరుగుతున్నదో వెంటనే ప్రజలకు తెలుస్తోంది. ఆ సంఘటనల కనుగుణంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు, నాంపల్లి క్రిమినల్ కోర్టు, వివిధ జిల్లాల్లోని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం జరగాలనివారు నినాదాలు చేశారు. నవంబర్ 30 నుంచి తెలంగాణ ఉద్యోగుల సంఘాలు పెన్‌డౌన్ ప్రకటించి అమలు జరుపుతున్నాయి. సచివాలయంలో తెలంగాణ ఉద్యో గుల సంఘాలు సంయుక్తంగా ప్రధానగేటు నుంచి 'డిబ్లాక్ వరకు ఊరేగింపు చేసి 'హైదరాబాద్ మాదిరా... ఫ్రీజోన్ కాదురా... అంటూ పిడికిలెత్తి నినాదాలు చేశారు. ఉద్విగ్న భరిత క్షణాలు సచివాలయంలో చోటు చేసుకున్నాయి.వరంగల్‌లో బిజెపి, ఖమ్మంలో న్యూ-డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు, నాయకులు రోడ్లపై కొచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తమ తమ పార్టీల జండాలతో ఊరేగారు.హైదరాబాద్‌లోని కాంగ్రెస్ వృద్దనాయకుల్లో 'కాక పెరిగింది. తామూ ఉన్నామని గళం వినిపిస్తున్నారు.రచయితలు, కళా కారులు, జర్నలిస్టులు, మేధావులు గన్‌పార్క్‌లో దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యేక తెలంగాణ కోసం నినాదాలు చేశారు. సమైక్య రాష్ట్రం కోరేనాయకుల గొంతు మూగపోయింది. వాస్తవ పరిస్థితులను విద్యార్థులే నిలదీస్తుంటే, ఆగ్రహంతో ప్రశ్నిస్తుంటే వారి దగ్గర సమాధానంలేదు. గతంలో దబా యంచినట్టుగా, అభివృద్ధి జపం వల్లించినట్టుగా ఇప్పుడు చేస్తే ముప్పు ఉందని గ్రహించి మిన్నకుంటున్నారు.దబాయింపులు - అభివృద్ధి మంత్రాలు ఎంత కాలం పని చేయవని రుజువయింది. ఆత్మగౌరవం ముందు, స్వావలంబన ఎదుట ఇలాంటి మాటలు పని చేయవని తెలసొచ్చింది. ప్రభుత్వం ఎంత బింకం ప్రదర్శించినా వేడి పెరుగుతోందనే విషయాన్ని గ్రహించింది. 2001 సంవత్సరం నుంచి జరుగుతున్న ఆందోళనలే కదా? ఇలాంటివి ఎన్నో చూశాం అన్న ధీమాకు తొలి రెండు రోజులు ప్రదర్శించినా అనంతరం ఉద్యమ తీవ్రతను అంచనా వేయ డానికి పూనుకుంది. ముఖ్యంగా మానవ హక్కుల కమిషన్ విద్యార్థుల హక్కుల కాపాడేందుకు నడుం బిగించడంతో ఉక్కు పాదంతో ఉద్యమాన్ని గతంలో మాదిరి అణచివేయలేమన్న తెలివిడి వచ్చింది. ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా నడిపిస్తామని, అహింసా యుతంగా కొనసాగిస్తామని, ఎన్ని అడ్డంకులెదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటిప్రతిజ్ఞ చేయడంతో 1974 లో జెపి సంపూర్ణ విప్లవం నాటి ఆవేశం తిరిగి కనిపించింది.ఒక జిల్లాలోనో, ఒక తాలూకాలోనో గాక తెలంగాణ పది జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో అందరూ నివ్వెరపోతున్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకులే 'ఉద్యమ పల్స్‌ను పుట్టకోలేకపోతున్నారు. పరిస్థితి చేయిజారి పోయిందని వారే స్వయంగా ప్రకటిస్తున్నారు.వాస్తవానికి ఈ పరిస్తితికి కారణం వారే... 1956లో అప్పటి ప్రధాని నెహ్రూ నిజమాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ... కొన్ని కారణాలచేత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం చేసి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తొలగి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశాం.ఈ కాపురం సజావుగా సాగకుంటే శాంతియుతంగా విడిపోవచ్చు. అని అధికార పూర్వకంగా ప్రకటించారు. ప్రధాని నెహ్రూపై గల గౌరవంతో, అభిమానంతో తెలంగాణ నాయకులు అన్యమనస్కంగానే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం పెట్టారు. ఆ తరువాత జరిగినదంతా ఉల్లంఘనలే! 1969 నెహ్రూ చెప్పిన పద్దతిలో విడిపోతామని విద్యా ర్థులు, ఉద్యోగులు, ప్రజలు ముందుకొస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చిచంపారు.ఆ నాటి ఉద్యమాన్ని కాంగ్రెస్ నాయకులు బలితీసుకున్నారు. ద్రోహం చేశారు. దగా చేశారు. చరత్రహీనులయ్యారు.ఆత్మవిమర్శ చేసుకుని తరువాతనైనా తెలంగాణకు నిధులు, విధులు, నీళ్ళ విషయంలో న్యాయం చేశారా?... అంటే అదీ లేదు. అందుకే 2009 సంవత్సరంలో విద్యార్థులు రాజకీయ నాయకులపై విశ్వాసం లేదని ప్రకటిస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రప్రభుత్వం ఇంకా తాత్సా రం చేయకుండా, ఇప్పటికి చేసినహాని ఇక్కడితో నిలిపివేసి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించడంలోనే విజ్ఞత ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment