Thursday, December 24, 2009

వేరెవర్‌ యూ గో!!!

“మరో ప్రపంచంమరో ప్రపంచంమరో ప్రపంచం పిలిచిందీ…”టీవీలో శ్రీశ్రీ పాట. స్టూడెంట్స్ క్యాంటీన్‌ అంతా వినబడుతోంది. వేడి వేడి చాయ్‌ తాగుతూ టీవీలో లీనమైపోయా.మధ్యలో తల పక్కకు తిప్పి చూసిన.నా పక్కనున్నోడు సూత్తండా లేదా అని!వాడు సూత్తలేడు…ఈ స్వీడనోడికి పుస్తకాల గోల తప్ప ఇంకేం పట్టేటట్టు లేదు.మనమే కదిలిస్తే పోలా!
“హే … బెంగ్త్‌, సీ దట్‌ సాంగ్‌. ఇటీజ్‌ ది మోస్ట్ పాపులర్‌ సాంగ్‌ ఇన్‌ తెలుగు” అని చెప్పిన.“ఓ ఈజ్‌ ఇట్‌ ట్రూ?”సందేహంగానే టీవీ వైపు చూశాడు.
“యస్‌ మ్యాన్‌. ఇట్స్ ఎ గైడింగ్‌ సాంగ్‌ ఫర్‌ అవర్‌ ప్రోగ్రెసివ్‌ పీపుల్‌ అండ్‌ మ్యూజిక్‌ లవర్స్‌”.నమ్మలేనట్టు కనుబొమ్మలెగరేశాడు బెంగ్త్‌.“ఇట్స్ ఓకే. హూ ఈజ్‌ ది రైటర్‌ ఆఫ్‌ దిస్‌ సాంగ్‌?” తర్వాతి ప్రశ్నను నా మీదికి సంధించాడు.
వీన్ని కదిలించి తప్పు చేశానా అనిపించింది. సర్లే ఏం చేస్తాం? తప్పదు.పాటను చూసుడు ఒదిలి “శ్రీశ్రీ” అని సమాధానం ఇచ్చిన.నా నుండి ఆ ఆన్సర్‌ వచ్చిందో లేదో “వాట్‌ ఈజ్‌ హిజ్‌ కాస్ట్‌?” మరో పిడుగు నా నెత్తిన పడింది.
వీడు భలే మొనగాడురా అయ్యా! ఎవల పేర్జెప్పినా వాళ్ల కులమడుగుడు వీనికి బాగా అలవాటైందని మనుసుల్నే అనుకున్న.“హీ ఈజ్‌ ఎ బ్రాహ్మిన్‌” అని ఎప్పుడైతే అన్ననో వీళ్ల అయ్య సొమ్మంతా శ్రీశ్రీ తిన్నట్లు మొకమంతా మాడ్చుకున్నడు.“హే, ఐ డోంట్‌ లైక్‌ బ్రాహ్మిన్‌ సాంగ్స్‌. ఐ లైక్‌ ఓన్లీ దళిత్‌ సాంగ్స్‌” భుజాలెగరేస్తూ సల్లగన్నడు.
నవ్వాల్నో ఏడ్వాల్నో సమజ్‌గాలె. ఈ తెల్లోడు మా దగ్గర్నే గిట్ల మాట్లాడుతడా? లేకపోతే నాన్‌ దళిత్స్ దగ్గర గూడ గిట్లనే ఉంటడో తెల్వలే! దళితుల మీద రీసెర్చ్ పేరుతో ‘సెంట్రల్‌ యూనివర్సిటి’కి వీడొచ్చినప్పటి నుండి సూత్తాన్న. గిదే వరస. సరే వీని శీలాన్ని ఎందుకు శంకించాలే? మనోడో, మందోడో ఓ తెల్లోడు ఇక్కడ చీకటి బతుకుల గురించి రీసెర్చ్ చేస్తున్నడు. ఇగ మనం గాకుంటే గీనికి ఎవడు హెల్ప్ జేస్తడు. మళ్లీ కలుస్తనని జెప్పి లైబ్రరీ దిక్కు కదిల్న. చెరగని చిరునవ్వు మొఖంతోటి బాయ్‌ బాయ్‌ అన్నడు.
***
ఆ రాత్రి అనిపించింది. రేపు ఎల్లుండి యూనివర్సిటి బంద్‌ కదా. ఓ సారి ఇంటి మొఖాన పొయొస్తె అయిపోద్ది. ఇంటికి పోక చాన దినాలాయె. అమ్మను నాయినను చూసి కష్టసుఖం ఇసారించొస్తే మంచిగుంటది. స్కాలర్‌షిప్‌ పైసల్‌ గూడ వచ్చినయ్‌. ఓ ఐదొందలు అవ్వకిత్తె అది దిల్‌ఖుష్‌ అయితదనుకున్న.చీకటితోటే లేచి ఆదరబాదర బ్యాగు సదురుకున్న. హాస్టల్ల టిపిన్‌ చేసి భుజానికి బ్యాగు తగిలిచ్చుకొని బైలెల్లిన. హాస్టల్లకెల్లి బైటికొత్తాంటె … బెంగ్త్ గాడు ఎదురైండు.‘ఇంటికి పోతాన, రెండ్రోజులల్ల వొస్తా, మల్లొచ్చినంక కలుద్దా’మన్న. ఏ ఊరు మీదని ఇంగ్లీషుల్నే అడిగిండు. ‘వరంగల్‌’ అన్న.
“ఐ థింక్‌ వరంగల్‌ ఈజ్‌ ఏ హిస్టారికల్‌ ప్లేస్‌?” అన్నడు. ఔ వీనికెట్ల తెల్సింది? అయినా గీ రోజుల్ల ఇంటర్నెట్‌ ఉన్నది. ప్రపంచంల ఏడ ఏమున్నదో క్షణంల తెల్సుకుంటున్నరు గదా!
“నేను గూడ మీ ఊరొస్త. అక్కడ నాక్కొన్ని ఇంటర్వ్యూలు దొరకొచ్చు. అట్నే మీ కుటుంబాన్ని గూడ సూసినట్టుంటది ఫ్రెండ్‌” అన్నడు.సరే, వాన్నెందుకు కాదనాలే. తొందరగ పోవాలె. లేటయితే ట్రేనెల్లి పోతదంటే ఉరికి, వాని రూములున్న బ్యాగుల ఓ బుల్లి కెమెరా, ఐపాడేసుకొని నాతోపాటొచ్చిండు.
***
పట్నంల ఎవ్వల్‌ బెంగ్త్‌ని పట్టించుకోలేగాని, మా వూళ్లె మాత్రం అందరు పరెషాన్‌గ చూస్తున్నరు. నేనేదో కోతిని పట్టుకొని తిరుగుతున్నట్టు గుసగుసలాడుతున్నరు. వాళ్ల ఆశ్చర్యం చూసి నాగ్గూడ నవ్వొచ్చింది. గింతల్నే బెంగ్త్ తనను చూసెటోళ్లను, నన్ను అర్థం చేసుకొని సిన్నగ నవ్విండు.
“వీళ్లంత నన్ను చూసి నవ్వి ఊరుకుంటున్నరు గాని, నాలుగేండ్ల కిందట నేను ‘ఇథియోపియా’ పోయినప్పుడు చూడాలె” అన్నడు బిక్కమొఖంతో.ఏం జరిగిందని ఇంట్రెస్టుతో అడిగిన.
“ఏమున్నది ఓ ముప్పై నలభై మంది బ్లాక్స్ చిన్నపిల్లలు నా యెంటబడి నేనెటుపోతె అటే వచ్చుకుంట ఫారినర్‌ … ఫారినర్‌ … అని అరుసుడు మొదలుపెట్టిండ్రు. ఇగ నేను సిగ్గుతో నవ్వలేక సచ్చాను” అని గొల్లుమన్నడు.ఇద్దరం నవ్వుల పువ్వులైనం.
***
రెండ్రోజులు మస్తుగ ఎంజాయ్‌ చేసినం. బెంగ్త్ నాన్‌వెజ్‌ తినననేటోడు. కాని మా అయ్య నాటుకోడిని కోస్తే, కారమున్న గూడ కిక్కురుమనకుండ కమ్మగ తిన్నడు. ఖిలా వరంగల్‌, వేయిస్తంభాల గుడి, కాకతీయుల కోట తిరిగి లెక్కలేనన్ని ఫోటోలు దిగినం. బెంగ్త్ సంబురానికి హద్దేలేదు. వరంగల్‌ మస్తు ఉందన్నడు. జీవితంల మరిచిపోలేనన్నడు. ఇగ ఆనందంగా మరుసటి రోజు పొద్దుగాల హైదరాబాద్‌ బైల్దేరినం. గోల్కొండ ట్రైన్‌ కోసం ప్లాట్‌ ఫాం మీదికొచ్చినం. పల్లికాయలు నముల్త ట్రైన్‌ కోసం ఎదురుసూసుకుంట బెంచీ మీద కూసున్నం. పల్లీలు పొట్లం కట్టిన కాగితం మీద ఓ అందమైన అమ్మాయి బొమ్మున్నది. బొమ్మకింద అక్షరాల్లో ఆమె పేరున్నది.
‘మొట్టమొదటి ప్రపంచ సుందరి ఈవిడే’నని హెడ్డింగ్‌ కనిపించింది. తెలుగులో ఉన్న మ్యాటర్‌ని సదివి బెంగ్త్‌కి ఇంగ్లీష్‌లోకి అనువదించి చెప్పిన. ఆ తరువాత అతని స్పందన చూసి ఆశ్చర్యపడ్డ -
“ఇట్స్ నాట్‌ ఏ సర్‌ప్రైజ్‌ మ్యాటర్‌, వీ నీడ్‌ దళిత్‌ మిస్‌ వరల్డ్‌”.
వాడి మాటలాగిపోయాయి. నాలో ఆలోచన మొదలైంది. అందాల పోటీలా..? దళితులకా? కనీసం మనిషిగా చూడని లోకంలో అందాల పోటీల కలలెలా వస్తాయి? అవమానాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు తప్ప ఇక్కడ మాకేం మిగిలిందని? లోపలెక్కడొ నా మనసు మూగగా రోదించింది. దళిత జీవితమంటే నిత్యం ఓ పచ్చిగాయాల కుండ కదా.
నేస్తమా, ఈ గడ్డమీద పుట్టలేదు గనుకే నువ్వు ఆ కల కనగలిగావు. మా కలలన్ని ఎప్పుడో కల్లలైపోయాయి. “యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌ …” రైల్వే అనౌన్స్‌మెంట్‌తో ఈ లోకంల కొచ్చిన.
జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నేనే త్వరగా లోపలికెక్కి, సీట్‌ వెతికే పనిలో ఉన్న. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ అయ్యేసరికి హౌజ్‌ఫుల్‌ థియేటర్‌లా ఉంది గోల్కొండ. ఇంతలో బ్యాగ్‌లతో బెంగ్త్ “వాట్‌ హాప్పెండ్‌? నో సీట్స్ ఫర్‌ దళిత్స్‌?” అని చమత్కరించాడు.
వీడు సామాన్యుడు కాదురో నాయన అనుకున్న. ఈ దేశంల నిజాల్ని బహిరంగంగా మాట్లాడొద్దని వీడికి తెలియదు కదా! అలా దేవులాడుకుంట ముందుకు పొయినంక రెండు సీట్లు దొరికాయి. మాకంటే ముందే కూర్చున్న జనాలు బెంగ్త్ ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతని గురించి తెలుసుకోవాలనె కుతూహలంతో ఉన్నట్లు వాళ్ల ముఖాలు చెప్తున్నాయ్‌.
నా ముందు సీట్లో ఇస్త్రీ మడతలు చెదరని ఖద్దరు బట్టలేసుకున్న పెద్దమనిషి ఉన్నాడు. గంభీరమైన రూపంతో కళ్లద్దాలు సవరించుకొని మా యిద్దర్నే జాగ్రత్తగా చూస్తున్నాడు. వయసు యాభై పైనే ఉండొచ్చు. ఉండబట్టలేక “గీనెదెక్కడ?” అనేసిండు నాతో. అనుకున్నట్టే ప్రశ్నల వాన మొదలైంది.
“స్వీడన్‌”ఒక్కమాటలో సమాధానం రాయండి ప్రశ్నకు జవాబులా చెప్పిన.“ఏం పనిమీదొచ్చిండు?”“రీసర్చ్ చెయ్యడానికి”
కొద్దో గొప్పో చదువుకున్నట్టున్నడు పెద్దమనిషి. పైగా అప్పటిదాకా చదివినట్టు తన చేతిలో న్యూస్‌ పేపర్‌ చూస్తే తెలుస్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఏం ఆలోచించుకున్నడో …తల ఒకవైపు వంచి ఓరచూపుతో “గంత దూరం నుండి ఈడికి ఏం రీసెర్చ్ చెయ్యనీకొచ్చిండు?”ప్రశ్నల వాన ఊపందుకుంది.
బెంగ్త్ గురించి పెద్ద మనిషికి పూర్తిగా తెలుసుకోవాలనిపించిందో, లేకపోతే తాను సదువుకున్నోనని తన పక్కనున్న వాళ్లముందు నిరూపించుకోవాలనుకున్నాడో ఏమో …!
ప్రశ్న ఎనుక ప్రశ్నేస్తనే ఉన్నడు.“క్యాస్ట్‌ డిస్క్రిమినేషన్‌ ఇన్‌ ఇండియన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌” అని తడబడకుండా చెప్పి పెద్దమనిషి దిక్కే చూసిన.
అర్థం కానీ కాకపోనీ చెప్పనైతే చెప్పిన. అర్థం అయీ కానట్టు తలాడించిండు పెద్దమనిషి.సరే అర్థమయ్యెటట్టు చెప్పుదామని మళ్లొకసారి తెలుగుల గూడ చెప్పిన.పెద్దమనిషి ఒక్క క్షణం గూడ ఆగకుండ -
“యహే గీ కాలంల క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్‌?” పూర్తిగ లోతులు తెలిసినట్టు అన్నడు.“అదేంది సార్‌? అంటే ఏంది మీ ఉద్దేశం?” నాలో ఒక అగ్నిపర్వతం రగిలింది. కానీ అదిగూడ ప్రశాంతంగనే.పెద్దమనిషి నా ప్రశ్నను లైట్‌ తీసుకున్నట్టున్నడు.
“ఆ ఏమున్నది సారు, కాలం మారింది. గీ రోజుల్ల అందరు కలిసి సమానంగనే ఉంటున్నరు కదా? కింద కులాలోళ్లు కూడ మస్తు బాగుపడ్డరు. సదువుల్ల, కొలువుల్ల అన్నిట్ల మంచిగనే ఉన్నదంటున్న” .
ఆ మాటల్లోనే పెద్దమనిషి పెద్ద కులపోడని అర్థమైంది. ఆయన్లో కింద కులాలోల్ల మీద ఇంకెంత అక్కసు దాగుందో ఆ తరువాత మాటల్లో తెలిసింది.“మీరేమనుకోకుంటే ఓ ప్రశ్నడుగుతా?” అని మెల్లగా పర్మిషన్‌ తీసుకొని “మీ క్యాస్టేంది సార్‌?” అని పులితోకను గుంజినంత పని చేసిన.
“ఆ ఎందుకు సార్‌?” అనుకుంటనే “ఓ.సి” అని గల్లెగరేసినట్టు గర్రతో అన్నడు.ఊహించినట్టే కిటుకు తెలిసిపోయింది.“అదీ కతా, గందుకే మీరట్ల మాట్లాడుతున్నరు.”నా మాటకు పెద్దమనిషికి కోపం నశాలానికంటింది.
“ఎట్ల మాట్లాడుతున్నరు సారు? మీరే సూడుండ్రి. వాళ్లకు ఫీజులెవ్వాయె, గీజులెవ్వాయె. అంతా పుక్యానికేనాయె. ఎక్కడ పొయినా అన్నీ ఫ్రీయేనాయె. రిజర్వేషన్లు అన్నీ వాళ్లకే ఉండే …” గొంతు కొంచెం పెరిగింది. కింది కులాలోల్ల మీద పెద్దమనిషికి పీకలదాకా కోపం, ఓర్వలేనితనం ఉన్నయని అర్థమైంది.
కోపం మీదున్నోనికి ఆవేశంగా సమాధానమిస్తే మరింత కోపమొస్తదని గ్రహించిన.నెమ్మదిగా “సరేసారు, మీరన్నట్టు కింది కులాలోల్లంత బాగుపడ్డరనుకుంటే …
గీ దేశంల రాజ్యాధికారం ఎవలకున్నది?గీ దేశంల భూములు, సంపద ఎవరి చేతిలున్నయి?పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎవరి దగ్గరున్నయ్‌?
సదువుకున్న వాళ్లలో కింది కులాలోల్లెందరు? అగ్రవర్ణాలెందరు?ఉద్యోగాల్జేస్తున్నోలల్ల వీళ్లెందరు? వాళ్లెందరు? మీకు తెలుసా సార్‌?”లెన్త్ కొంచెం పెద్దయినా, పెద్దమనిషికి మాత్రం నిజం తెల్వాలన్నట్లు భారీ లెక్చరే ఇచ్చిన.
పెద్దమనిషికి బీపీ పెరిగినట్టున్నది. అయినా నలుగురి ముందు ఎనుకడుగు ఎయ్యొద్దని మేకపోతు గాంభీర్యాన్ని నటించడం మొదలుపెట్టిండు. అందరు చూస్తున్నరా ఏందని ఒకసారి అటీటు జరిగినట్టు చేసినంకా, గొంతు సవరించుకొని, “గిన్ని మాట్లాడుతున్నవ్‌, మీదే కులం?” అని చిట్టచివరి ఆయుధాన్ని ప్రయోగించిండు. అది గూడ సిన్మల విలనడిగినట్టే అడిగిండు.
“మేం మాదిగోళ్లం!” తుపాకి నుండి దూసుకపోయిన బుల్లెట్‌లా నా సమాధానం.నా నోటి నుండి ఆ మాటొచ్చే సరికి పెద్దమనిషికి నోటి మాట పడిపోయినట్టయ్యింది.గిప్పటిదాక గీ మాదిగోన్ని సారంటినా అనుకున్నడేమో?
“అరె మా కొడుకులెవనికి గింత తెలివి రాలేదెందుకయ్యా బాబు” కపట ప్రేమతో దీర్ఘం తీసిండు.నా కులం తెల్వంగనే నన్ను సార్‌ అనొద్దు అనుకున్నడని అర్థమైంది. మళ్ల పెద్దమనిషే శక్తినంత కూడదీసుకొని -
“బాబూ, మా ఊళ్ళెనైతే మాల మాదిగల్ని ఒక్క మాటనేటట్టు లేదు. ఏమన్నంటే ఎస్సి, ఎస్‌టి అట్రాసిటి కేసంట్రుండ్రు. ఎవ్వనేమనేటట్టు లేదాయే” విచారపడుతున్నట్టు అన్నడు.
ఆ కేసుల వల్ల పెద్దకులపు పెద్దమనిషికి ఎక్కడాలేని కష్టమైతున్నట్టు ఆయన మాటల వెనక ఓ నిగూఢార్థం.
“సరే సారు, మీరు కులంలేదు, కుల వివక్ష లేదంటున్నరు కదా! నేను మీ ఊళ్లె ఉంట. మీ ఇంటి పక్కన నాకు ఇల్లిస్తరా చెప్పుండ్రి?”నా ప్రశ్నకు బిత్తరపోవడం పెద్దమనిషి వంతయ్యింది.
మా సంభాషణ చూస్తున్న వాళ్లకు ఇంకాసేపట్లో ఇక్కడేదో యుద్ధం జరిగేట్టున్నదని రక్షణ మార్గాలను వెతుకుతున్నట్టున్నరు. పెద్దమనిషి మాత్రం ‘ఇప్పుడే వస్తా’ అనుకుంట టాయిలెట్‌కని లేసిండు.
పోతూ పోతూ “నీ యమ్మా అలగాజనం. ఎంతకు జరుగరు. దిక్కుమాలిన రిజర్వేషన్‌ దొరకక ఈ తంటాలు”జనాలు ఎక్కువుండేసరికి నా మీదున్న కోపాన్ని వాళ్లమీద చూపిస్తున్నడని నాకు అర్థంకానీకి ఎంతో టైం పట్టలేదు. అంతల్నే ఇంకొక ముసలాయన మా లొల్లంత ఇన్నట్టున్నడు.
“ఎన్కటున్నట్టు గిప్పుడైతే లేదుగని, పురాగ లేదనైతే అనలేము సారు” మనసుల మాట బైట పెట్టిండు.“నేనుగదే అంటున్న తాత, ఆ పెద్దకులపు పెద్దమనిషికి ధైర్యమొస్తలేదు” అనంగనే -‘ఏం చేస్తం తియ్‌’ అన్నట్టు తలూపిండు.
లోపలికి పోయి ఏమేం ఆలోచించిండో పెద్దమనిషి రెండోసారి యుద్ధంలో అడుగుపెట్టినట్టు వొచ్చిండు.నాతో వాదిస్తే ఓడిపోవుడు ఖాయమనుకున్నట్టు గొంతు తగ్గించి మాట్లాడుడు మొదలుపెట్టిండు.“ఇగొ నువ్వేమో మంచిగ మర్యాదగ మాట్లాడుతున్నవ్‌? మా ఊళ్లె మాదిగోళ్లను సూడు ఎట్లా మాట్లాడుతరో”
కరిగిపోతున్న పరపతిని గుర్తు చేసుకున్నట్లు పెద్దమనిషి మరో ఎత్తుగడతో అన్నడు. ఆ మాటతో నన్ను మినహాయించి, నా జాతిని దెబ్బతీయాలనుకున్నడా అనుకున్న.
“మాట అనేది మనం ఇతరులకిచ్చే మర్యాదను బట్టి ఉంటదండి” అని ఇంకేదో చెప్పబోతుంటే పెద్దమనిషి ఉడికిపోయి “నువ్వు ఎన్ని చెప్పిన కులం మాత్రం గిప్పుడులేదనే నా గట్టి నమ్మకం” తెగేసి చెప్పిండు.తను దిగే స్టేషన్‌ వచ్చింది కాబట్టి తన మాట నెగ్గించుకోవాలనుకున్నట్టున్నడు. అందరం నిశ్శబ్దంగా గీయన మారడని నిశ్చయించుకున్నట్లు కూసున్నం. బెంగ్త్ అన్ని అబ్జర్వ్‌ చేస్తున్నడు కానీ అర్థమవుతున్నట్టు లేదు. ఆ తరువాత జరిగిన బాగోతాన్నంతా అనువదిస్తుండగా పెద్దమనిషి భారత కులవ్యవస్థను మరోసారి నిరూపించిండు.“ఒరే మల్లయ్య ఏడున్నవురా?” అని గద్దించిండు.అప్పటిదాక డోర్‌కాడ కూసున్న మనిషొకడు పరుగున పెద్దమనిషి దగ్గరికొచ్చిండు.
“దొరా వస్తిని, వస్తిని” అనుకుంట పెద్దమనిషికి సంబంధించిన సంచులు, సామాన్లు నెత్తిన పెట్టుకుని పెద్దమనిషి ఎనుకాలే అడుగులేసిండు.బెంగ్త్‌కి విషయమంత అర్థమైనట్లుంది. ట్రైన్‌ దిగుతున్న దొరను చూసి -“వేర్‌ ఎవర్‌ యూ గో ది క్యాస్ట్‌ ఫాలోస్‌ ఇన్‌ ఇండియా” అన్నడు.మా ఇద్దరి ముఖాల్లో చిన్న చిరునవ్వు మెరిసింది. మరో యుద్ధం కోసమన్నట్టు ట్రెన్‌ కదిలింది. (2009, ఆదివారం ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి) - పసునూరి రవీందర్‌

Thursday, December 17, 2009

తెలంగాణవాదం ఇంట్ల శురుగావలె !

అందరికి చెప్పే ముందు మన ఇంట్ల, మన ఒంట్ల శురుగావలె అంటారు , అవును అది నిజం బై!
తమ్మి మొదలు మనం శురు చెయ్యాలే ! మన ఇంట్ల శురు కావలె.. చెప్పుండ్రి మీ ఇంట్ల "అవ్వా! ఇంట్ల కెళ్ళి బయటికి బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా బై. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త"
మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా.
మీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది!
ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే!
గంట కన్నా అద్వానామ మనం! ఇడిచి ఇడిచి కొట్టున్ద్రి ఆంధ్రోల్లను! మా కి కిరి కిరి !!
గీసొంటి మాటలు మన పానం లెక్క గుండెల ఉండాలే తెలంగాణా కోసం పోరాడాలే !!
ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్మి, ఓ కాకా, ఓ అత్తమ్మ, ఓ చిన్నయ్య ఇంటున్ద్రా!
జై తెలంగాణా జై జై తెలంగాణా!!

వరంగల్ ప్రయాగ!

ఉద్యమంపై వ్యాఖ్యానించే ముందు ఒక్క క్షణం

ఒక వైపు మహోధృతంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమంలో మా భూమిపుత్రులు తమ ప్రాణాలు తామే అర్పించుకుంటుంటే కొందరు సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు బ్లాగుల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణా ఉద్యమం ఎందుకు జరుగుతుందో అనేక సార్లు వివరించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయని వీరు కేసీఆర్ ను విమర్శించే నెపంతో తెలంగాణా ప్రజలను దూషిస్తున్నారు.
విధ్వంసం విధ్వంసం అని గుండెలు బాదుకుంటున్నవారు ఒక సారి అలోచించండి ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.
ఇంకొక ప్రాణం కూడా వృధా కావొద్దు అని మేము ఇక్కడ విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకుంటున్నాం.
మీకొకటే విజ్ఞప్తి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందీ దేశంలో. సమైక్య రాష్ట్రం ఎందుకు అవసరమో తప్పకుండా మీ అభిప్రాయాలను రాయండి. సమైక్యత సాధించడం కొరకు చేయాల్సిన కృషి తప్పకుండా చేయండి. కానీ ఒక్క నిముషం అలోచించండి. అసలే అవేశాలు రగులుతున్న ఈ సమయంలో మీరు చేసే ఈ అనాలోచిత వ్యాఖ్యలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. అమెరికాలోనో, కెనడాలోనో కూర్చుని మీరో వెకిలి వ్యాఖ్య చేసి మీ నోటి కుతి తీర్చుకుని ఆనందపడవచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఒక్కోసారి బడబాగ్నిని రగల్చవచ్చు. అది అమాయకులనే దహించివేస్తుంది.
అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.
సమైక్య రాష్ట్రం ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం. దీనిపై దయచేసి వెకిలి రాతలు రాయకండి.
మీకు ధ్వంసం అవుతున్న ఆస్థులు కనపడుతున్నాయి. మాకు ధ్వంసం అవుతున్న తెలంగాణా భవిష్యత్ తరంపై ఆందోళనగా ఉన్నది

Wednesday, December 16, 2009

అవ్వా ! నేను బోథనే !

అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి
కర్ణగూరం పోరు గడ్డ పంపుతుంది కళాకారులను - నిజంబాద్ నిప్పురవ్వ తొలుతుంది పోరగాండ్లను
అద్‌లబాద్ అడివిగడ్డ దింపుతుంది తన బిడ్దలను - ఖమ్మం మట్టినుండి కదులుతుండ్రు కార్మిక అన్నలు
అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి
ఓరుగల్లు ఖిల్లా నుండి గజ్జ కట్టి దూనుకుతుండ్రు అక్కా చెల్లెళ్ళు - మెదక్ పల్లెల్ళ నుండి జై కొడుతుండ్రు అన్నా తమ్మూండ్లు రణబిడ్దలు రైతన్నలను వదులుతుంది - రంగారెడ్డికరువు కన్నీళ్లను దాచుకుని పద పద మంటూ ఉరుకుతుంది మైబుబ్‌నగర్ అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరులోకి
లక్ష్మి నరశింహులై ఉప్పెనల వస్తుంది కొండా నల్లగొండ - తెలంగాణా గుండె కాయ హైదరాబాదు సై సై మంటూ సైరన్ మోగిస్తుంది అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి

Tuesday, December 15, 2009

ఎవరు ఎం అంటున్నారు?

అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా — గద్దర్

యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది — అన్నవరం దేవేందర్

జో జిస్సే మిలా సీఖా హమ్‌నే - గైరోంకో భీ అప్నాయా హమ్‌నే’ (ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం - పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం) ఇది హైద్రాబాద్‌ గొప్పతనం ! — సలాం హైద్రాబాద్

పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది — కాళోజి

నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది — అన్నవరం దేవేందర్

తెలంగాణ వేరైతేచెలిమి తుట్టి పడుతుందా?తెలంగాణ వేరైతేచెలిమి లెండిపొతాయా?… తెలంగాణ వేరైతేదేశానికి ఆపత్తా? - కాళోజి

అవతరణ నాటి కటిక చీకటి చెప్పకుంటే ఎట్ల తెల్లార్తది — అన్నవరం దేవేందర్

రైతు రైఫిలై నిజాం మీద పోరాడిన నేల యిది వారసత్వం నడుస్తాంది — అన్నవరం దేవేందర్

ఆత్మ గౌరవాన్ని ఎట్లా ప్యాక్ చేస్తావ్ ? — అన్నవరం దేవేందర్

కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణాపాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి

ఇక్కడి మన్నుముర్క సూస్తే పోరాటం వాసన పొటమరిస్తది — అన్నవరం దేవేందర్

ఎవల అవ్వ భాష వాళ్ళకు బువ్వ — అన్నవరం దేవేందర్

నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి

అగర్‌ కిసీ ఖౌమ్‌ కో బర్బాద్‌ కర్నాహైతో పహెలే ఉస్‌కీ జబాన్‌ కీంచ్‌లో అన్న నానుడిని తెలంగాణలో నిజం చేసినారు. - పరవస్తు లోకేశ్వర్‌ హైద్రాబాదీ

పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ

నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను — దాశరధి

సమైఖ్యంగా ఉందాం అని ఇట్ల ‘ధ్వంస రచన’తోటా చెప్పేది ? ఇదేనా సంయమనం తోటి ఉద్యమాలు చేసుడంటె ?

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా?

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా? తెలంగాణ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కకూడదనుకొంటోందా? తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ద్వారా కాంగ్రెస్ నేతలు లాభం పొందాలనుకుంటున్నారా?తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు చూసినా.. తెలంగాణ ఉద్యమ చరిత్రను పరిశీలించినా.. అందరికీ సహజంగానే కలిగే సందేహాలివి. మూడు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ పోరాటం కూడా.. కాంగ్రెస్ నేతల పన్నిన కుట్రలతోనే నీరుగారిపోయింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు పర్చాలంటూ.. 1969 జనవరి 9న ఖమ్మంలో ఓ విద్యార్థి నిరహారదీక్షకు దిగడంతో.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. ఇది క్రమంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. వీరి చొరవతోనే.. తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మొదలైనా.. మధ్యలో మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డిలతో పాటు.. మరికొంతమంది నేతలు కూడా ఇందులో చేరడంతో.. రాజకీయ రంగు పులుముకొంది. జనవరి నుంచి.. సెప్టెంబర్ వరకూ కళాశాలలను.. తరగతులను వదిలి విద్యార్థులంతా ఉద్యమంలో పాల్గొన్నారు. మార్చి నుంచి తీవ్రరూపం దాల్చిన ఈ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో, అగంతకుల దాడుల్లో దాదాపు 370 మంది బలయ్యారు. ఏప్రిల్ ఆరో తేదీన టీపీఎస్ హైదరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లోనే యాభై మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఈ కాల్పుల తర్వాత.. తెలంగాణలో హింసాత్మక ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. మరో రెండేళ్ల పాటు సాగిన తర్వాత.. 1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణలోని పది స్థానాలను గెలుచుకొని టిపీఎస్ చరిత్ర సృష్టించింది. కాకపోతే.. దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధిచండంతో.. టిపీఎస్‌ను ఆమె లెక్కచేయలేదు. ఇదే సమయంలో చెన్నారెడ్డి టిపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. ప్రత్యేక పోరాటం ముగిసిపోయింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్న వాదనను.. ఇప్పటి సీనియర్లు అంగీకరించడం లేదు. ఇతర పార్టీలే ప్రజలను మోసం చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి ఉద్యమాలు కాంగ్రెస్‌కు అలవాటేనంటున్నారు. ఇక కాంగ్రెస్‌లోనే కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలూ.. సీనియర్ల తీరుపై అనుమానాలను కలుగ జేస్తున్నాయి. తెలంగాణలోని కొంతమంది నేతల వల్లే తెలంగాణ రావడం లేదంటూ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి ఆరోపణలు గుప్పించారు. ఇతర పార్టీల్లోని తెలంగాణ నేతలూ కలిసికట్టుగా పోరాడితే తప్ప ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నారే తప్ప.. లీడ్ తీసుకోవడానికీ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధంగా లేరు. అధిష్టానంతో పోరాడి.. ప్రత్యేక రాష్ట్ర్రాన్ని సాధించాలన్న ఆలోచనా లేదు. సోనియాగాంధీకి విన్నవించుకోవడం తప్ప.. డిమాండ్ చేసే అవకాశమే లేదు. పైగా వారిలో వారికే ఎన్నో భేషజాలు.. మరెన్నో అభిప్రాయ భేదాలు. అధిష్టానం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోకూడన్న ఆలోచనలు.. వీటి మధ్య.. ఢిల్లీ వెళ్లి వీరంతా కలిసికట్టుగా పోరాడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తుంటే.. ఉద్యమం క్రెడిట్ ఒక్క టిఆర్‌ఎస్‌కు .. అందులోనూ కేసీఆర్‌కు మాత్రమే దక్కకూడదనే.. కాంగ్రెస్ నేతలు మళ్లీ గళమెత్తడానికి కారణంగా కనిపిస్తోంది. శాసనమండలిలో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇదే అభిప్రాయానికి వచ్చారు. ఉద్యమాన్ని మరోసారి హైజాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు..

ఎటు పోతానవ్ - జార ఇను !!!!

అన్నల్లారా! అక్కల్లారా!

మూడున్నర కోట్ల తెలంగాణ బిడ్డల్లారా… నిజాం పాలన పోతే బాధలన్ని పోతయనుకున్నం. మనం గాకపోయినా మన పొల్లగాండ్లయినా తెల్లగ బతుకుతరనుకున్నం. కాని నోరు అందల మెక్కుదామంటే నొసలు కట్టెలు మోపియ్యవట్టె. బతుకు పేనం మీది నుంచి పొయ్యిల పడ్డట్టాయె. బుదురకిచ్చి పొత్తు గూడుదామనిరి. ఉప్పేసి పొత్తు గూడిరి. మనం వద్దు వద్దన్నా బల్మీటికి బక్తున్ని జేసి పంగ నామాలు వెట్టిరి. తుడుసుకుందామంటే పోయేదా ఇడుసుకుందామంటే వచ్చేదా. ఎవలో ముగ్గురు ఒప్పుకున్నరని మూడు కోట్లమందిని బందీలు జేసిరి. ఇగో.. ఇదే నవంబర్‌ ఒక్కటిన మన బతుకులు నాశనం జేసిరి. 1948లో మనకు ససంత్ర మచ్చింది. 8 ఏండ్లళ్ల కొద్దిగ ఈకె దేరినమో లేదో తల్లివేరుకు పుల్లవెట్టిరి.

మాయమాటలు జెప్పి 1956లో పొత్తు గలిపిరి. మనిషిని మనిషి ఇంత మోసం జేత్తడని మనం అనుకుంటమా..? సరే వాళ్లకు రాజధాని లేదుగదా, ఆఫీసులు లేవుగదా, పైసలు, నీళ్లు, బొగ్గు ఏదీ లేదు కదా? ఎట్ల బతుకుతరు పాపం. కొంచం కొంచం ఇస్తే పంచనపడి ఉంటరు గదా అనుకుంటిమిగాని నప్పతుగ బొందిగ ఇరుత్తరని, పాపమని పటివెటు గంజివోత్తే కారం లేదని కశీరు ఎక్కుతరని అనుకున్నామా? 1956 నుంచి ఎన్ని పోరాటాలను అనుగదొక్కిరి.. ఎంతమంది పోరగాండ్లను చంపిరి.. అగ్గోలె రాజుకున్న ఉద్యమాల మీద ఎన్నిసార్లు నీళ్లు జల్లిరి.. పట్నం భూములన్ని అమ్ముకొనిరి. కొలువులన్నీ గుంజుకొనిరి. ఇగ ఇట్లగాదని అసలుకే ఎసరు వెట్టిరి.

మన కాయకష్టంతో కట్టుకున్న పట్నాన్ని పొత్తుల జోన్‌ జేసిరి. ఇంకేం మిగిలింది చెప్పుండ్రి. గోదావరి ఇక్కడ పారుతది- పంటలు అక్కడ పండుతయి. కృష్ణమ్మ మన పక్కనుంచే పోతది- మనకు తాగుదామంటే నీళ్లుండయి. బొగ్గుబాయి ఇక్కడుంటది- కరెంటు బుగ్గ అక్కడ వెలుగుతది. కొలువులు ఇక్కడుంటయి- మనుసులు అక్కడోళ్లుంటరు. భూములు ఇక్కడుంటయి- పట్టాదారులు అక్కడుంటరు. పాలన ఇక్కడుంటది- పాలకులు అక్కడుంటరు. మన ఎమ్మెల్యేలు గూడా సెక్రెటేరియట్‌ పోవాలంటే జంకుతరు. వాళ్ల వార్డుమెంబర్లు గూడా సెక్రటేరియట్ల చక్రం తిప్పుతరు.. ఎన్నడు ఆంధ్రకు వరదలచ్చినా లేసినోడు లెవ్వనోడు జోలెగట్టి బిచ్చమడుగుతరు. మనకు ఏండ్లకేండ్లు కరువచ్చింది.

అట్టశాపల లెక్కమాడుతున్నాం. నడీ వానకాలంల గూడా తాగేనీళ్లు లేక తండ్లాడుతున్నం. బతుకుదెరువు లేక మస్కట్‌, దుబాయి బతుకవోయినం. అక్కడ వేలమంది జైలు పాలయ్యిండ్రు. మరి ఒక్కడు నోరెత్తిండా.. మన బతుకు గురించి మాట్లాడుతుండా…

మరి మనం ఎం చెయ్యలె ...ఆరే ఎన్ద్ బ్రదర్ గది సుత నేనే జెప్పల్నా !!! దా పోదాం.. తెలంగాణా తీస్కాద్దాం

హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!

1956 లో ఆంద్ర తెలంగాణా లు విలీనం అయ్యేప్పుడు ఆంద్ర రాష్ట్రానికి రాజ దాని కర్నూలు. హైదరాబాద్ రాష్ట్రానికి (తెలంగాణాకు) రాజధాని హైదరాబాద్.వందల వేల సంవత్సరాలు గా తెలంగాణాకు హైదరాబాదే తలకాయ లా వుంది. ఇప్పుడు ఆ తలకాయను ఎవడు తీసేసేది. ఎట్లా తీసేస్తారు? అసలు ఆ ఆలోచనే రక్తాన్ని మరిగిస్తోంది. ఇదొక దుర్మార్గమా , ఇదొక మడత పెచీయా విడిపోయటప్పుడు!

విద్యార్థి వీరులకు జోహార్లు - గద్దర్‌

విద్యార్థి వీరులకు జోహార్లు

వీరులార - మీకు జోహార్లు...
పారె నెత్తుటి పోరుల జోహార్లు..
విద్యార్థులార జోహార్లు...
వీరులారా

పొద్దు పొడిసె యాల - చదువు నేర్పె యాల
ఆటలాడుకొని - పాట పాడెటి యాల
చదివించిన తల్లి - సద్ది మూటయ్యే వేలా
తెలంగాణ తల్లి - సంకెళ్ళ తెంపనికి
జై తెలంగాణ అంటు - జెంగులోన దుంకి
కాంగ్రేసు సర్కారు కాల్పులకు ఎదురొడ్డి
తుపాకి గుండ్లకు గుండెలను చూపిన
విద్యార్థులారా - మీకు జోహార్లు
వీరులారా

నూనూగు మీసాల నూరేండ్ల బతుకులు
కన్న తల్లీ దండ్రి కలల పంటలు మీరు
భరత మాతా తల్లి భావి పౌరులు మీరు
శాస్త్రవేత్తలు మీరు సమరయోధులు మీరు
నిజమైన ప్రేమికులు - లైలా మజ్నూలు మీరు
భగత్‌ సింగన్నకు భళె ముద్దు తమ్ముళ్ళు
తెలంగాణ తల్లీ కన్నీళ్ళు బెట్టితె
రణం లోనా దుంకి రుణం దీర్చుకున్న
వీరులారా

మీ త్యాగం చూసి సృష్టి బిత్తరబాయె
గోదావరీ తల్లి గుండె కద్దూకుంది
కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్ళు రాల్చింది
సింగరేణి తల్లి శిగ ముడి ఇప్పింది
దండకారణ్యం మీ మెడల దండయ్యి
అడవి గోగుపూలు ఆరతీ బట్టినయి
వీరులారా

వీరత్వము చూసి - శూరత్వము చూసి
కొమరం భీం అన్న మా కొడుకులే అండు
సమ్మక్క సారక్క శభాష్‌ కొడుకంది
చాకలి ఐలమ్మ ముద్దాడి మురిసింది
బందగి చెయ్యెత్తి వందనం అన్నాడు
వీర తెలంగాణ పేరు నిలిపిండ్రాని
పల్లె పల్లె మీకు మల్లెలు చల్లినయి
వీరులారా

మీ చావు వార్తా విన్న మా కోడిపుంజులు
కాళ్ళకు కత్తులు కట్టుకొని దుంకినయి
మీ అరుపులు విన్న మా ల్యాగ దూడలు
కొమ్ములు అదిలించి కోడెలై లేసినయి
పాలు తాపిన పిల్లి పెంచుకున్నా కుక్క
మీ పోరు దారుల్లో పరుగులు దీసినయి
వీరులారా

మీ త్యాగమును చూసి - మీ ధైర్యమును చూసి
భద్రాది సీతమ్మ భళిరే భళి అన్నాది
కొమరెల్లి మల్లన్న కూత బెట్టినాడు
యముడాల రాజన్న శంఖం ఊదినాడు
యాదగిరి నరసింహ యుద్ధంకే సిద్ధమని
వెయి స్తంభాల గుడి జై జై అంటు
రామప్ప గుడి లేసి రణం గంటా ఊపె
వీరులారా

ఓ లచ్చ గుమ్మడీ!

నిండు అమావాస్య నాడే ఓ లచ్చ గుమ్మడీ
ఆడ పిల్ల పుత్తినాదే ఓ లచ్చ గుమ్మడీ
అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడీ
మొగుడు ముద్దాడరాలె ఓ లచ్చ గుమ్మడీ

బట్టలల్ల సుట్టుకొని ఓ లచ్చ గుమ్మడీ
బాయిలో పడేయబోతే ఓ లచ్చ గుమ్మడీ
గంగమ్మ కొంగు (వొడి) సాపి ఓ లచ్చ గుమ్మడీ
సెల్లదానమియ్యమంది ఓ లచ్చ గుమ్మడీ

సెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడీ
సెత్త కుండిలెయ్యబోతె ఓ లచ్చ గుమ్మడీ
కుక్కపిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మడీ
అక్క అట్ల సేయకనే ఓ లచ్చ గుమ్మడీ

ఊపిరాడకుండనేమో ఓ లచ్చ గుమ్మడీ
బొంతమీద బొంత గప్తె ఓ లచ్చ గుమ్మడీ
సిల్లీరంద్రం నుండి ఓ లచ్చ గుమ్మడీ
సిన్నంగ చూస్తుంది ఓ లచ్చ గుమ్మడీ

పున్నమి దినము గోలె ఓ లచ్చ గుమ్మడీ
పుట్టకాడ పడవేస్తె ఓ లచ్చ గుమ్మడీ
నాగన్న పడిగె విప్పి ఓ లచ్చ గుమ్మడీ
గొడుగు బట్టిండమ్మ ఓ లచ్చ గుమ్మడీ

వురి బోసినట్లు నేను ఓ లచ్చ గుమ్మడీ
నల్లబూస దారం గడితే ఓ లచ్చ గుమ్మడీ
నల్లపూస దండలేమొ ఓ లచ్చ గుమ్మడీ
మల్లెపూల దండలాయె ఓ లచ్చ గుమ్మడీ

పాలు తాపనని నేను ఓ లచ్చ గుమ్మడీ
పంతాలు పట్టుకొంటె ఓ లచ్చ గుమ్మడీ
పాలసేపు దుంకిపోయి ఓ లచ్చ గుమ్మడీ
పాపనోట్లె బడ్డదమ్మొ ఓ లచ్చ గుమ్మడీ

వరిగింజ నోట్లో వేసి ఓ లచ్చ గుమ్మడీ
గొంతు బిస్క నెను పోతే ఓ లచ్చ గుమ్మడీ
పెదువులోమె అడ్డమొచ్చి ఓ లచ్చ గుమ్మడీ
పుల్కు పుల్కు నవ్వెనమ్మో ఓ లచ్చ గుమ్మడీ

కనుకున్న కడ్పుకోత ఓ లచ్చ గుమ్మడీ
కన్నీటి దారలాయె ఓ లచ్చ గుమ్మడీ
పేగుకోసి పెమ్చుకొన్న ఓ లచ్చ గుమ్మడీ
నా పాపనెట్లు పారేతూ ఓ లచ్చ గుమ్మడీ

ఆడదానితో అన్న మనిరి ఓ లచ్చ గుమ్మడీ
మొగోనితోనే పిల్లలనిరి ఓ లచ్చ గుమ్మడీ
మొగబిడ్డ చెయ్యని పాపం ఓ లచ్చ గుమ్మడీ
ఆడబిడ్డలేమి చేసే ఓ లచ్చ గుమ్మడీ
ఆడబిడ్డ లేనిదే ఓ లచ్చ గుమ్మడీ
లోకమెట్లు పుట్టిపెరిగె ఓ లచ్చ గుమ్మడీ

కన్నబిడ్డ మీదనే ఓ లచ్చ గుమ్మడీ
కన్న తల్లె పగపడితే ఓ లచ్చ గుమ్మడీ
నాకు దిక్కెవరని ఓ లచ్చ గుమ్మడీ
బిక్కు బిక్కు ఏడ్సె బిడ్డ ఓ లచ్చ గుమ్మడీ
చిట్టి చిట్టి కండ్లతోని ఓ లచ్చ గుమ్మడీ
సూటి ప్రశ్న వేసె బిడ్డ ఓ లచ్చ గుమ్మడీ

నేను సెత్తల్లో పారెయ్యనమ్మా ఓ లచ్చ గుమ్మడీ
నా పొత్తిల్లో దాసుకుంటా ఓ లచ్చ గుమ్మడీ
నేను బావిలో పడెయ్యనమ్మా ఓ లచ్చ గుమ్మడీ
నేను వొరిగింజ వేసి చంపా ఓ లచ్చ గుమ్మడీ
నేను వురిపోసి చంపుకోను ఓ లచ్చ గుమ్మడీ

నిన్ను సమ్మక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడీ
సారక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడీ
అక్కా శోభక్కను చేస్తా ఓ లచ్చ గుమ్మడీ
చెల్లీ కుమారిని చేస్తా ఓ లచ్చ గుమ్మడీ
---- గద్దర్ పాటలు (1997-98) నుండి. సేకరణ సత్యం. ఓచ్త్ 1999,
జనంపాట ప్రచురణలు, భూదేవి నగర్, వెంకటాపురం, సికింద్రాబాదు
-15. వెల- రూ 15.

Monday, December 7, 2009

అస్సల్ గీ తెలంగాణ ఎంది భై - ఎన్దుక్ గావాలే!

'నా తెలంగాణ.. కోటి రతనాల వీణ..' ఇది ఒకప్పటి మాట.. నేడు ఈ ప్రాంత బిడ్డలు కష్టాల కొలిమిలో కాలిపోతూ కన్నీళ్లు పెడుతోందెందుకు..? ఆకలి మంటల్లో కాలుతూ మరణశయ్య మీద కొట్టుమిట్టాడుతోందెందుకు..? బుక్కెడు బువ్వకు దిక్కు లేక, డొక్క నిండేందుకు రెక్కాడక వలస బాట పట్టిందెందుకు..? పసి పిల్లల జీవితాలకు వెలకట్టడెమెందుకు.. పడతి మానానికి ఖరీదు కట్టడమెందుకు..? బ్రిటిష్‌ పాలకులతో పోరాడి గెంటేసినా, రజాకార్లను రక్తం చిందిస్తూనే తరిమికొట్టినా తీరని ఈ అవస్థను సృష్టించింది ఆంధ్రపాలకుల వ్యవస్థ. ఇది నిష్టూర సత్యం.. నిత్యం కళ్ల ముందు కనిపించే సత్యం.. ఇది తెలియాలంటే మీకు తెలంగాణ ఏమిటో తెలియాలి.. ఉమ్మడి రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలియాలి.. వాటి వల్ల ఏర్పడిన నష్టాలు తెలియాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కలిగే లాభాలు తెలియాలి.. తెలుసుకోండి.. ఒక్కసారి ఆలోచించండి..!

నాటి తెలంగాణ
రాజకీయ చరిత్ర చూస్తే 1294-1351 కాలంలో ముల్కీ ఉద్యమాలు ముఖ్య పాత్ర పోషించాయి. ఖిల్లీ, తుగ్లగ్‌లతో పాటు దక్షిణాది నుంచి వచ్చి స్థిరపడిన వారందరినీ దక్కనీలుగా పిలిచారు. ఆ తర్వాత విభేదాలతో వీరంతా షియాలు, సున్నీలుగా విడిపోయారు. 1422-1435 కాలంలో ఒకటో అహ్మద్‌షా కాలంలో ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. 1436-1458లో రెండో అహ్మద్‌షా కాలం నాటికి ఇవి మరింత తీవ్రమయ్యాయి. 1512లో కూలీకుతుబ్‌షా ఈ ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యమాల ఫలితంగా సంభవించిన రాజ్య పతనం నుంచి గుణపాఠం నేర్చుకొని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డాడు.

మళ్లీ తలెత్తిన ముల్కీ సమస్య
ఐదో నిజాం కాలంలో మళ్లీ ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు మొదలయ్యాయి. అవి ఈనాటికీ రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయి. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగి మొగల్‌ సామ్రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్‌ ప్రాంతాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఏ కల్లోలం లేని నిజాం రాజ్యానికి వలస వచ్చారు. కవులు, కళాకారులు, విద్యావంతులు ఇక్కడికి తరలివచ్చారు. ఐదో నిజాం కాలంలో సాలార్‌జంగ్‌ పరిపాలనా సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం వలస వచ్చారు. స్థానికులకు శిక్షణనిచ్చి తీర్చిదిద్ది వెనక్కి వెళ్లిపోతారన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ సంస్కరణ బెడిసి కొట్టింది. ఇక్కడే తిష్ట వేసుకొని ఉన్న ఉద్యోగాలే కాకుండా వచ్చిన ఉద్యోగాల్లో కూడా తమ వారినే నియమించుకొని స్థానికులను అణిచివేశారు. కిషన్‌ప్రసాద్‌ బహద్దుర్‌ పోరాటంతో కొంత మేరకు ప్రయోజనం చేకూరినా ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటి కొచ్చింది. 1948లో పోలీసు చర్య జరిగే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్‌ముల్కీలదే పెత్తనం.

మొగ్గ తొడిగిన నిరసన
నైజాం హైదరాబాద్‌ సంస్థానం మూడు భాషా ప్రాంతాలతో కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలుగు మాట్లాడే 8 జిల్లాలు హైదరాబాద్‌లో ఉండేవి. వీటితో పాటు మరాఠీ భాష మాట్లాడే 5 జిల్లాలు, కన్నడం మాట్లాడే మూడు జిల్లాలు కలుపుకొని మొత్తం 16 జిల్లాలు హైదరాబాద్‌ సంస్థానంలో ఉండేవి. 1948 సెప్టెంబరు 13వ తేదీన భారత ప్రభుత్వం హైదరాబాద్‌ సంస్థానంపై పోలీస్‌ చర్యను ప్రారంభించింది. సెప్టెంబరు 17వ తేదీన నిజాం రాచరికం అంతమైంది. హైదరాబాద్‌ రాష్ట్రంలో మిలిటరీ గవర్నర్‌గా జేఎన్‌ చౌదరినినియమించారు. 1949 డిసెంబరు వరకు ఇది కొనసాగింది. 1950లో సీనియర్‌ సివిల్‌ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. 1952 సాధారణ ఎన్నికల తర్వాత బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే సమయంలో ఉద్యోగాల వేటలో ఆంధ్రులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. తెలంగాణ వారికి ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేదన్న సాకుతో ఇష్టారాజ్యంగా ఆంధ్రులను ఇక్కడి ఉద్యోగాలలో నియమించడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టులో హైదరాబాద్‌ హిత సంరక్షణ సమితి పేరిట తొలి ఉద్యమం ఆంధ్రుల పెత్తనానికి నిరసనగా మొగ్గతొడిగింది. కానీ అధిష్టానం బెదిరింపులు, బుజ్జగింపుల కారణంగా మొగ్గలోనే రాలిపోయింది.

ఓరుగల్లులో శ్రీకారం..
ఆంధ్రపాలకుల అహంకారజ్వాలలో మాడిపోయిన తెలంగాణ వాసుల పోరుకు ఓరుగల్లులో శ్రీకారం చుట్టారు.మొదట ఈ ఉద్యమం విద్యార్థుల ఆధ్వర్యంలో 1952 జూన్‌ 26న వరంగల్‌లో ప్రారంభమైంది. స్థానికేతరులను ఉద్యోగాల నుంచి తొలగించి స్థానికులకు అవకాశం కల్పిస్తామన్న హామీతో ఉద్యమాన్ని విరమించారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 7వ తేదీన ఖమ్మం మెట్టులో మరో ఉద్యమం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌, ఔరంగాబాద్‌ తదితర చోట్ల ఆందోళనలు జరిగాయి. హన్మకొండలో విద్యార్థుల ఒంటి మీద లాఠీలు విరిగాయి. దీన్ని నిరసిస్తూ హైదరాబాద్‌, సూర్యాపేట పట్టణాలలో నినాదాలు, ర్యాలీలు, బహిరంగ సభలతో తెలంగాణ అట్టుడికింది. తెలంగాణ ఐక్యవేదిక ఉద్యమ నాయకుడైన కేశవరావుజాదవ్‌ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమం పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పులలో ఏడుగురు విద్యార్థులు నేలకొరిగారు. ఇదే దశలో కాళోజీ నారాయణరావు, జయశంకర్‌ తదితరులు ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకొచ్చారు.

ఆంధ్రుల సృష్టి విశాలాంధ్ర
మహా భారతంలో శకునిలా మాయపాచికలతో పథక రచన చేసే ఆంధ్రులు, ఆంధ్రపాలకుల కుట్రల ఫలితంగా విశాలాంధ్ర ఉద్యమం బలం పుంజుకుంది. 1949లో అయ్యిదేవర కాళేశ్వర్‌రావు ఈ విశాలాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ విలీనానికి పాచికలు కదిపారు. ఆంధ్ర మహాసభలో సైతం ఈ ప్రస్తావన తీసుకురాగా అప్పటి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఇది గాలి మాటగా కొట్టిపారేశారు. సుందరయ్య 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం', కమ్యూనిస్టుల ఒకే జాతి, ఒకే భాష. ఒకే రాష్ట్రం అన్న ప్రచారాన్ని ఉద్యమానికి ఊపునిచ్చాయి. కాంగ్రెస్‌కు తెలంగాణలో 1952లో జరిగిన ఎన్నికలలో అధిక సీట్లు రాకపోవడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. వీరి కుట్రల ఫలితంగా మొదట విజయవాడ అనుకున్నా తర్వాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది ఆంధ్ర ప్రాంతం నుంచి బెజవాడ గోపాల్‌రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కావిరంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి,జేవీ నర్సింగ్‌రావులు 1956 ఫిబ్రవరి 20వతేదీన ఢిల్లీలో సమావేశమై ఓ నిర్ణయానికి రాగా 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.

అమలుకు నోచని 14 సూత్రాలు
ఆంధ్రుల ఉక్కుపాదాలు తెలంగాణ ప్రాబల్యాన్ని అణిచివేసే ప్రక్రియ ఆక్షణం నుంచే ఆరంభమైంది. ఈ రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రంగా పేరు పెడదామన్న తెలంగాణ నేతల వాదనను ఆక్షేపించిన ఆంధ్రనేతలు దీనిని ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండేందుకు గాను కేంద్రం సమక్షంలో ఆనాడే 14 సూత్రాలను రూపొందించారు. కానీ అవేవీ అమలులో లేవు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే మిగులు బడ్జెట్‌ ఆప్రాంతం అభివృద్ధికే కేటాయించాలని, మధ్య పాన నిషేధాన్ని తెలంగాణ వాసులు కోరితే అమలు చేయాలని, విద్యా, ఉద్యోగరంగాలలో తెలంగాణకు సంబంధించి ఇక్కడి వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగాల తీసివేత ఆయా ప్రాంతాల వారి నిష్పత్తిని బట్టే జరగాలని, ముఖ్యమంత్రిత్వ శాఖలలో ఏవేనీ రెండు శాఖలు తెలంగాణ నేతలకు అప్పగించాలని ఇలాంటి వన్నీ అందులో ఉన్నాయి. కానీ ఇన్నేళ్లలో వీటిలో ఏ ఒక్కటీ అమలు లోనికి రాలేదు. అణిచివేతలు, దురాక్రమణలు, అధిపత్యం, చివరికి అంత్యక్రియలలోనూ తెలంగాణ వాసుల పట్ల వివక్ష కొనసాగింది.

పాల్వంచలో మొదలైన ఉద్యమం
ఈ వివక్షను ఓర్వలేకపోయిన తెలంగాణ వాసుల గుండెలు అగ్ని గుండాల్లా రగిలిపోయాయి. ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం... ఇంకానా... ఇకపై సాగదు... అన్న శ్రీశ్రీ అక్షరాల సాక్షిగా ఖమ్మం జిల్లా పాల్వంచలోని ధర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 1969 జనవరి 5వ తేదీన మళ్లీ ఉద్యమం మొదలైంది. తెలంగాణ వాసులు కాని వారిని వెనక్కి పంపించాలన్న ఈ ఉద్యమం జనవరిలో నిజమాబాద్‌కు పాకింది. మర్రి చెన్నారెడ్డితో పాటు ప్రముఖులు సహకారం ఉండడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాలు, ర్యాలీలు, నినాదాలు, లాఠీఛార్జీలతో రాజధాని నగరమైన హైదరాబాద్‌ వేడెక్కింది. ఫలితం అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మనందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తామని, తెలంగాణ నిధులలెక్క తేల్చి చెపుతామని, తెలంగాణ రక్షణ అమలు చేస్తామని చెప్పారు. హామీల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారు. కానీ ఆహామీలు కూడా అమలుకు నోచుకోలేదు. ఉద్యమ ఫలితంగా తెలంగాణ వాసులను రెండువేల ఉద్యోగాలు మాత్రం కేటాయించారు. ఇలా చెపుతూపోతే తెలంగాణ ఉద్యమం నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాసుల గుండె నిత్యం రగిలిపోతూనే ఉంది.

ఆ పోరాటమే స్ఫూర్తి..
ఆనాటి మహామహుల పోరాటమే స్ఫూర్తిగా తిరిగి 1999లో కల్వకుంట చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు. నానాటికీ పెచ్చుమీరుతున్న ఆంధ్రపాలకులను అణిచివేసి ఉద్యోగాలు లేక, ఉపాధి వనరులు లేక అల్లాడుతున్న తెలంగాణ నిరుపేదల గుండె మంటలు చల్లార్చేందుకు శ్రీకారం చుట్టుకున్నదే ఈ ఉద్యమం. 1999లో శ్రీకారం చుట్టుకున్న ఈ ఉద్యమం 2001 నాటికి ఊహించని రీతిలో బలోపేతమైంది. తెలంగాణ వాసులలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆగ్రహ జ్వాలలు ఈ ఉద్యమం ద్వారా వెలుగులోనికి వచ్చాయి. తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు సైతం ఈ ఉద్యమం మనకోసమే నంటూ తోడు నిలిచారు.. నడుం బిగించి ముందుకు కదిలారు.. దీంతో పల్లెసీమలు, పట్టణాలు, తండాలు తెలంగాణ డప్పు చప్పుళ్లు, తెలంగాణ గీతాలతో మారుమోగాయి. పాలకులను తట్టి లేపాయి. ఫలితంగా పార్టీలు, పాలక వర్గాలు కూడా తెలంగాణ ఏర్పాటుకు తమ అంగీకారాన్ని తెలిపే దిశకు వారిని నడిపించిన ఘనత కేసీఆర్‌దే..

తెలంగాణ ఎందుకు..?
అవగాహన లేని వారి మనసుల్లో ఉద్భవించే తొలి ప్రశ్న ఇదే. ఇందుకు ఎన్నో సమాధానాలున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రగతి, తెలంగాణ వాసుల జీవితాలలో మార్పు ప్రత్యేక రాష్ట్రం మీదనే ఆధారపడి ఉంది. తెలంగాణ వస్తే కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు మన కళ్లముందే పారుతాయి. రైతుల కళ్లలో కాంతులు నిండుతాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ రూ.70 వేల కోట్లు ఉంటుంది. ఈ ఆదాయంతో సక్రమమైన ప్రణాళికల ద్వారా ఐదేళ్లలో రాష్ట్రాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దవచ్చు. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తే మిగతా రూ.55 వేల కోట్ల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ, విద్యారంగాల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి, వైద్యరంగం ప్రగతి వంటివి ఎన్నో చేపట్టవచ్చు. ఒక్కో జిల్లా అభివృద్ధికి రూ.5 వేల కోట్ల చొప్పున కేటాయించవచ్చు.

మన వనరులు మనకే..
సింగరేణి బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటు తెలంగాణకు మాత్రమే ఇచ్చుకుంటే రైతుకు 24 గంటల పాటు వ్యవసాయ విద్యుత్‌ ఇవ్వవచ్చు. విలీనానికి ముందు రూపకల్పన చేసిన ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్ల కాలంలో పూర్తి చేయవచ్చు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించొచ్చు. వ్యవసాయ వృద్ధితో ఒనగూరే సంపదతో లక్షలాది మంది యువతకు పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించవచ్చు. అక్షరాస్యతలో వెనుకబడిన తెలంగాణలో గ్రామానికో పాఠశాలను నెలకొల్పి ఉచిత విద్య ద్వారా 10 ఏళ్లలో నూరు శాతం అక్షరాస్యత సాధించవచ్చు. రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు, జూనియర్‌, కార్పొరేట్‌ కళాశాలల ఏర్పాటు, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల, జిల్లా కేంద్రంలో మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు, జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ వంటివి అందించవచ్చు. చదువుకున్న నిరుద్యోగులకు రుణ సౌకర్యం ద్వారా పరిశ్రమలను స్థాపించుకునే అవకాశం కల్పించవచ్చు. గిరిజనతండాలను పంచాయతీలుగా మార్చవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు జరుగుతున్న అన్యాయాలను నివారించి వారికి విద్య, వైద్య, ఉపాధి రంగాలలో అవకాశాలు కల్పించవచ్చు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున సాగు భూమి అందించవచ్చు. ఆకలి చావులకు దూరంగా, వలసలకు భిన్నంగా సస్యశ్యామల తెలంగాణ రాష్ట్రాన్ని చూడవచ్చు. సుఖమయ జీవితానికి బాటలు పరచవచ్చు.

తెలంగాణ ఇంకెన్ని త్యాగాలు చేయాలి?

నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి పోలీసుస్టేషన్‌లో పని చేసే కృష్ణయ్య తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని డిసెంబర్‌ ఒకటిన కామారెడ్డిలో మరణించాడు. ఆయన ఆఖరుగా అన్న మాటలు 'జై తెలంగాణ. అంతకు ముందు రోజు వరంగల్‌జిల్లాకు చెందిన విద్యార్థి భూక్యప్రవీణ్‌, మెదక్‌ జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ అనే విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకోసం ఆత్మార్పణ చేశారు. అదేరోజు కరీంనగర్‌ జిల్లాలో తెరాస కార్యకర్త పృధ్వీరాజ్‌ జరుగుతునన పరిణా మాలను జీర్ణించుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిపీఠం ఎక్కాడు. అంతకుముందు రోజు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో నల్గొండజిల్లాకు చెందిన విద్యార్థి శ్రీకాంత్‌ ఒంటిపై కిరోసిన్‌/పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి.అదేరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన దమనకాండ, పోలీసుల జులుం, క్రౌర్యం తాళలేక ఒక విద్యార్థి మరణించాడు. పోలీసుల లాఠీలకు ఎందరో విద్యార్థుల తలలు పగిలాయి. కాళ్లు, చేతులు విరిగాయి. మరెందరో ఆసుపత్రులపాలయ్యారు. ఇట్లా తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా వారం, పది రోజులక్రితంవరకు సాధారణ విద్యార్థులు, వ్యక్తులు. కాని వారిఆశయం, లక్ష్యసాధనకోసం చేసిన త్యాగం తో వారు గొప్ప వీరులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారు. త్యాగాలు ప్రణాళికా బద్ధంగా జరగవు.ఉద్వేగం, ఉద్రేకం, ఆవేశం కట్టలు తెంచుకుని తాము ఆశించిన పవిత్ర మార్గం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆత్మార్పణ చేసిన త్యాగధనులు వీరు.1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఆందోళనలో 350 మంది విద్యార్థి, యువకులుసైతం ఇదే విధంగా తమ ప్రాణాలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తృణప్రాయంగా అర్పించారు. సరిగ్గా నలభై సంవత్సరాల అనంతరం అంతే ఉద్వేగంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆందోళన అగ్గి రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు (కెసిఆర్‌) ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నవంబర్‌ 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు బయల ుదేరగా పోలీసులు అతడిని మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకోవడంతో నిప్పురవ్వ ఎగిసిపడింది. ఉస్మానియా, కాక తీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యా లయాల విద్యార్థులు కదం తొక్కుతూ రోడ్లపైకి రావడం నిప్పురవ్వ కాస్త మంటగా రూపాంతరం చెందింది.1969 నాటి ఉద్యమంకన్నా వేడిగా, వాడిగా, వేగంగా 2009 నాటి ఈ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన విస్తరించింది. ప్రచార, ప్రసారసాధనాల కారణంగా ఎక్కడ, ఎప్పుడు, ఏమి జరుగుతున్నదో వెంటనే ప్రజలకు తెలుస్తోంది. ఆ సంఘటనల కనుగుణంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు, నాంపల్లి క్రిమినల్‌ కోర్టు, వివిధ జిల్లాల్లోని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఆవిర్భావం జరగాలనివారు నినాదాలు చేశారు. నవంబర్‌ 30 నుంచి తెలంగాణ ఉద్యోగుల సంఘాలు పెన్‌డౌన్‌ ప్రకటించి అమలు జరుపుతున్నాయి. సచివాలయంలో తెలంగాణ ఉద్యో గుల సంఘాలు సంయుక్తంగా ప్రధానగేటు నుంచి 'డిబ్లాక్‌ వరకు ఊరేగింపు చేసి 'హైదరాబాద్‌ మాదిరా... ఫ్రీజోన్‌ కాదురా... అంటూ పిడికిలెత్తి నినాదాలు చేశారు. ఉద్విగ్న భరిత క్షణాలు సచివాలయంలో చోటు చేసుకున్నాయి.వరంగల్‌లో బిజెపి, ఖమ్మంలో న్యూ-డెమోక్రసీ పార్టీల కార్యకర్తలు, నాయకులు రోడ్లపై కొచ్చి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తమ తమ పార్టీల జండాలతో ఊరేగారు.హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ వృద్దనాయకుల్లో 'కాక పెరిగింది. తామూ ఉన్నామని గళం వినిపిస్తున్నారు.రచయితలు, కళా కారులు, జర్నలిస్టులు, మేధావులు గన్‌పార్క్‌లో దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యేక తెలంగాణ కోసం నినాదాలు చేశారు. సమైక్య రాష్ట్రం కోరేనాయకుల గొంతు మూగపోయింది. వాస్తవ పరిస్థితులను విద్యార్థులే నిలదీస్తుంటే, ఆగ్రహంతో ప్రశ్నిస్తుంటే వారి దగ్గర సమాధానంలేదు. గతంలో దబా యంచినట్టుగా, అభివృద్ధి జపం వల్లించినట్టుగా ఇప్పుడు చేస్తే ముప్పు ఉందని గ్రహించి మిన్నకుంటున్నారు.దబాయింపులు - అభివృద్ధి మంత్రాలు ఎంత కాలం పని చేయవని రుజువయింది. ఆత్మగౌరవం ముందు, స్వావలంబన ఎదుట ఇలాంటి మాటలు పని చేయవని తెలసొచ్చింది. ప్రభుత్వం ఎంత బింకం ప్రదర్శించినా వేడి పెరుగుతోందనే విషయాన్ని గ్రహించింది. 2001 సంవత్సరం నుంచి జరుగుతున్న ఆందోళనలే కదా? ఇలాంటివి ఎన్నో చూశాం అన్న ధీమాకు తొలి రెండు రోజులు ప్రదర్శించినా అనంతరం ఉద్యమ తీవ్రతను అంచనా వేయ డానికి పూనుకుంది. ముఖ్యంగా మానవ హక్కుల కమిషన్‌ విద్యార్థుల హక్కుల కాపాడేందుకు నడుం బిగించడంతో ఉక్కు పాదంతో ఉద్యమాన్ని గతంలో మాదిరి అణచివేయలేమన్న తెలివిడి వచ్చింది. ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా నడిపిస్తామని, అహింసా యుతంగా కొనసాగిస్తామని, ఎన్ని అడ్డంకులెదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటిప్రతిజ్ఞ చేయడంతో 1974 లో జెపి సంపూర్ణ విప్లవం నాటి ఆవేశం తిరిగి కనిపించింది.ఒక జిల్లాలోనో, ఒక తాలూకాలోనో గాక తెలంగాణ పది జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో అందరూ నివ్వెరపోతున్నారు. కాంగ్రెసు సీనియర్‌ నాయకులే 'ఉద్యమ పల్స్‌ను పుట్టకోలేకపోతున్నారు. పరిస్థితి చేయిజారి పోయిందని వారే స్వయంగా ప్రకటిస్తున్నారు.వాస్తవానికి ఈ పరిస్తితికి కారణం వారే... 1956లో అప్పటి ప్రధాని నెహ్రూ నిజమాబాద్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తూ... కొన్ని కారణాలచేత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం చేసి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన తొలగి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశాం.ఈ కాపురం సజావుగా సాగకుంటే శాంతియుతంగా విడిపోవచ్చు. అని అధికార పూర్వకంగా ప్రకటించారు. ప్రధాని నెహ్రూపై గల గౌరవంతో, అభిమానంతో తెలంగాణ నాయకులు అన్యమనస్కంగానే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం పెట్టారు. ఆ తరువాత జరిగినదంతా ఉల్లంఘనలే! 1969 నెహ్రూ చెప్పిన పద్దతిలో విడిపోతామని విద్యా ర్థులు, ఉద్యోగులు, ప్రజలు ముందుకొస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చిచంపారు.ఆ నాటి ఉద్యమాన్ని కాంగ్రెస్‌ నాయకులు బలితీసుకున్నారు. ద్రోహం చేశారు. దగా చేశారు. చరత్రహీనులయ్యారు.ఆత్మవిమర్శ చేసుకుని తరువాతనైనా తెలంగాణకు నిధులు, విధులు, నీళ్ళ విషయంలో న్యాయం చేశారా?... అంటే అదీ లేదు. అందుకే 2009 సంవత్సరంలో విద్యార్థులు రాజకీయ నాయకులపై విశ్వాసం లేదని ప్రకటిస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్రప్రభుత్వం ఇంకా తాత్సా రం చేయకుండా, ఇప్పటికి చేసినహాని ఇక్కడితో నిలిపివేసి ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించడంలోనే విజ్ఞత ఉంది.